Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

29, జూన్ 2011, బుధవారం

భయం

[పింగళి శశిధర్]

ఉదయాస్తమయాల మధ్య నున్న
కాసింత వెలుగే జీవితం

పలవరింతలతో కొంత
పగటికలలతో కొంత
కాలం సాగిపోతుంది

ఉదయం నాతోపాటే వచ్చిన నిన్ను 
వాకిటిలోనే వుంచి లోనికొచ్చాను !?
లోపలి ప్రపంచంలో లోకాలు సృష్టించుకుంటూ
నిజంగానే నిన్ను మర్చిపోయాను

అమాయకత్వంతో కొంత
అహంభావంతో కొంత..

నువ్వంటే నాకు నిర్వ్యక్తమైన ప్రేమ
అందుకే నా ఉచ్చ్వాస నిశ్వాసాల మధ్య
నీ ఉనికిని చూస్తూ జీవిస్తున్నాను..

ఆశలతో కొన్నాళ్ళూ..
ఆశయాలతో కొన్నాళ్ళూ..

నిజం చెప్పమంటావా.. నేస్తం! 
నువ్వంటే నాకు ... భయం
ఆదమరిచిన వేళ.. ఆప్యాయంగా..
వినిపించే నీ పలకరింత అంటే..
భయం..
నీ ప్రేమలొ తడిసిముద్దవుతానని 
భయం ..
నీ స్నేహంలో నన్ను నేను మర్చిపోతానని భయం .. 
నీ సమక్షంలో ..
నా అస్తిత్వాన్ని కోల్పోతానని
భయం...






16, జూన్ 2011, గురువారం

పార్వతీశ్వరా !

[పింగళి శశిధర్]
1.   దోసిలి యొగ్గి వేడెదను దోసము లెంచని స్వామివంచు, నీ
      సేసలు నెల్లవేళల వశీకర శ్రీకర మార్గదర్శులై
      శ్వాసగ నిండినామదిని శాశ్వత సుందర మార్గగామిగా
      చేసెదవంచు, నీ చరణ సేవన చేసెద పార్వతీశ్వరా !

2.   ఎన్ని వసంతముల్ చెలగి వీడెనొ వాడని జీవితాన, నే
      డెన్నికచేసెనావిధియె, ఈ శిశిరంబసమానరీతి, నీ
      మన్నన తగ్గెనేమొ ప్రభు! మానిత దివ్యకృపారసంబుతో
      నన్ను సమాదరించు భవనాశ వినాశక పార్వతీశ్వరా !

3.   అన్నియు విన్నపాలె, మురిపెంబున అన్నియు విన్నవించుకో
      మన్నను యేమి చెప్పుదు నుమాపతి ! నా గతి నీవయెంచి, నా
      పున్నెము జాలునట్టి నవపున్నమి బోలెడు జీవితంబుతో
      నన్ను సమాదరించు భువనైక మనోహర పార్వతీశ్వరా !

4.   ఎన్నియొ కోర్కెలన్ మదిని యేరిచి, కూరిచి వ్రాసిపెట్టితిన్
      కన్నుల ముందు నీవిటుల కానగవచ్చిన ఈ క్షణంబులో
      అన్నియు మర్చిపోయితిని, ఆరని కన్నుల నిన్ను ద్రావుచున్
      పన్నగ భూషణా! వరద! పాపవినాశక పార్వతీశ్వరా !

5.   అన్నము లేకనీవిటుల అంజలిసాచి చరించనేల, నీ
      కున్నది గాదె ముందరనె కోమలి మాయమ అన్నపూర్ణ, నీ
      వెన్నిక తోడ కోరినది వెన్కటి మాభవ రాశులేకదా !
      మన్నన చేసివేడెదను మాయని నీకృప పార్వతీశ్వరా !

6.   ఎవ్వరి కోసమీ తపన? ఎవ్వరు నన్నిట మెచ్చగావలెన్
      దవ్వుల నున్న నిన్నుగని దాహపుటార్తినెడందనిండగన్
      చివ్వున గుండెనందొక విచిత్రపు భావన రూపుదాల్చ, ఆ
      పువ్వులు మాలకట్టుకొని పూజకు తెచ్చితి పార్వతీశ్వరా !

7.   పెన్నిధి వోలె జీవులకు పెంపగు జీవన ముక్తినిచ్చి, శ్రీ
      పన్నగమున్ గజమ్ముల నపార కృపారసమందుదేల్చి, యా
      పన్నుల గాచినట్లు నెడబాయని, మాయని యాదరంబుతో
      నన్ను కృపామతింగనుము నాగవిభూషణ పార్వతీశ్వరా !

8.   నిన్ను కవుంగలించుకొన నిచ్ఛజనించెను తండ్రి, సుంత నా
      పన్నగభూషణాది జటపాయలనావల సద్దుకొమ్ము, నా
      చిన్ని మొగంబు నీ యెడద జేరిచి చెప్పెద నొక్కమాట, ఓ
      యన్న! దయామయా! శరణు, యాశ్రిత రక్షక! పార్వతీశ్వరా !

9.   ఉండునదేమొ కొండ, బహుదొడ్డది వెండిది, చల్లనౌచు, నీ
      గుండియవోలె నెల్లపుడు గొప్ప రసార్ద్రత నిండి, దండిగన్
      అండగనుండి కాచునటు నార్తిని వేడెద దేవదేవ! మా
      దండము స్వీకరించుము యుదారత బ్రోవుము పార్వతీశ్వరా !

10. పాహి! దయామయా! పరమ పావన! సజ్జనలోకవందితా!
      దేహియటంచు వేడెదను దేహములోపలనుండు నాత్మ, వి
     ద్రోహుల గెల్వగన్ నిను యధోచిత రీతుల ప్రస్తుతింతు, నం
     దేహము లేకకావుమయ దీనశరణ్యుడ! పార్వతీశ్వరా !

11. వేదపురాణగాధల, పలువేల్పులు నీకడజేరి, వారి సం
      వేదనతెల్పి బాపుమన వెంటనె వారికి అండనిల్చి, ఆ
      వేదనలన్ని తీర్చునటు, పేరిమి మమ్ముల నాదరించి, నీ
      వే, దయజూపి నాకుపరివేదన తీర్చుము! పార్వతీశ్వరా!

12. దిక్కులనున్న దేవతల దిక్కయి వారికి నెల్లవేళలన్
      చిక్కులనన్ని దీర్చుచును శ్రీలనొసంగుచు కాచునట్టి, ఓ
      చక్కని దేవరా! వినర శంకర! దీనుడవేడుచుంటి, నా
      ప్రక్కన నిల్చి యెల్లపుడు ప్రాపువహించుము పార్వతీశ్వరా!

13. ఇమ్మహి మానిసైబ్రతుక నిచ్ఛయొకింతయు లేదుతండ్రి, నే
      నమ్మిన నీపదద్వయమె నాకిల దిక్కగు నెల్లవేళలన్
      అమ్మయునీవు మాయెడల ఆదరముంచిన చాలుస్వామి, నీ
      కమ్మనిపాదసన్నిధియె గాచును మమ్మిల పార్వతీశ్వరా!

14. చక్కని భావమొక్కటియు చయ్యన తట్టదు మందబుద్ధికిన్
      పెక్కగు నీదు లీలలను పేరిమి కూర్చగ నాశకల్గె, నీ
     వొక్క రవంత నాయెడల ఓర్మివహించిదయారసంబు, ఎం
     చక్కగ నాదు శీర్షమున జల్లిన, వచ్చును పార్వతీశ్వరా!