Pages

స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

7, నవంబర్ 2008, శుక్రవారం

శాక్య కంఠీరవా !

[పింగళి వేంకట శ్రీనివాసరావు (శ్రీకాశ్యప)]

తే.గీ:   అది దయార్ణవ స్థగిత సింహాసనమ్ము
         అందు కొలువుండె కరుణార్ద్ర మందహాస
        చిన్మయాంచిత ముద్రికా శ్రీవతంసు
        డార్తి నెడబాపు శుధ్ధోదనాత్మజుండు.

తె.గీ: చెంతనే నాక వనసీమ సిరివెలార్చి
        నవ నవోన్మేషచంద్రికా యవనికలను
        పరచుకొన్న లుంబినీ వనమునందు
       విహరణార్ధము చనుదెంచె, మహిజనమ్ము.

సీ:    ముక్కుపచ్చారని మురిపెంపు నడలతో చిరునవ్వు లొలికించు చిన్నివారు
       ఆగామి జీవిత రాగోజ్వలత గోరి విద్యలార్జించెడి విమల మతులు
       ఎదపైన భవితను పదిలమ్ముగావించి సిరిమువ్వలై మ్రోయు తరుణితతులు
      మరుతరమ్ముల వారి కిరవైన మార్గముల్ సరిచేసి యాత్మలో మురియు వారు

తె.గీ: వారువీరని చెప్పంగవలను గాని సర్వహిత జనసందోహ పర్వమనగ
       నందనోద్యాన వనసీమ నవ్యగతులు తరచి తిలకించుచున్నట్టి తరుణమందు

తె.గీ: ఏదురాగత కాల సంహేలనమ్మొ
       జనసమూహము నచ్చోట కనిన విధికి
      కన్ను కుట్టెనొ యేమొ? కర్కశ కరాళ
      కారు చీకట్ల నీడలు క్రమ్ముకొనియె.

తె.గీ: ఒక్క నికృష్ట నీచ హింసోపభోగ
       లాలసుడు పన్ని బిగియించి లాగినట్టి
      యుచ్చు, శాంతిశ్రీ విభుమెడకచ్చమైన
      భయద యమపాశమై మహాధ్వంసమిడియె.

తె.గీ: భూమిలోపలి పిడుగులుప్పొంగి నటులు
       దిక్కటాహము లక్కడ పిక్కటిల్ల
       బాంబు విస్ఫోటనము జెందె ప్రజల నడుమ
      శాక్య వనమెల్ల రక్తంపు జలధి గాగ.

ఉ:  నాయను దిక్కులేని మరణమ్మును పొందిన మానవాళి, న
     న్యాయపు మృత్యువాత కెరయౌనటు జేసిన మానవాధమా!
     ఆయువుపోయు శక్తి కసహాయుడవైన భవత్కరమ్ముచే
     నాయువు తీయుహక్కు లెటు లబ్బును నీయది పాపకృత్యమౌ.

ఉ: జానెడు పొట్టకోసమయి సాటిజనాళిని మట్టువెట్టు, ఓ
    మానవ మాంసభక్షకుడ! మైల దొరంగెను నీదు జన్మ, నీ
    మ్లానిత హీన కృత్యమున మ్రగ్గినదీవ, త్వదీయ చేతనో
    ద్యానము కారుచిచ్చునకు నాహుతి యాయెను, దగ్ధజీవికా!

ఉ: స్వామి! తథాగతుండవయి సాక్షిగ నిల్చిన నీదు మ్రోలనే
    మామక మంజులమ్మగు యమాయక సోదర సోదరీమణుల్
    తామస రాజసమ్మగు యధార్మిక శక్తి కరాళ దంష్ట్రలన్
    చీమల బారులై సమయ, శ్రీకర! జూచుచునుంట పాడియే ?

చం: గుటగుటలాడు ప్రాణములు గొంతుకలోనిడి వధ్య వేదిపై
       కటికి కసాయి కత్తి కెరగా మెడసాచెడి ’గొఱ్ఱెపిల్ల’ సం
      దిట గదియించి హస్తమున మేనును దువ్వి భయంబు దీర్చు, నీ
      పటుతర దీనవత్సలత వాసి దరంగెనటోయి గౌతమా !

శా: ఛిద్రంబై ప్రవిశీర్ణ ధర్మమిటు సాక్షీభూతమై యొప్పు, నీ
     ముద్రారాక్షస మానవీయ చరితన్ మున్ముందు బోనాడుచున్
     నిద్రాణమ్మగు జాతినెల్ల మగుడన్ నిర్ణిద్ర గావింపగన్
     భద్రా! లెమ్మిక, దీక్షబూనుము మహాత్మా! శాక్యకంఠీరవా!
................అంకితం - నివాళి.................
తె.గీ: బాంబు విస్ఫోటనములోన ప్రాణములను
        బాసి దివికేగినట్టి నా భరత మాత
        ముద్దు బిడ్డల యాత్మలు ముక్తినొంద
       కవిత నంకితమ్మిడి, జేతు ఘన నివాళి.

(బుద్దుడు పుట్టిన పుణ్యబూమి లో, మహాత్ముడు నడయాడిన భరత భూమి లో అనునిత్యము ఏదో ఒక చోట శాంతి అహింసలకు మారుగా దౌర్జన్యం దమన కాండలే కానవస్తునాయి. మానవుడే మానవత్వాన్ని మరచి మృగమై చరించే మహా జనారణ్యమిది. తథాగతుని సాక్షిగా భాగ్యనగరంలో బలైపోయిన అభాగ్యుల ఆత్మ శాంతికై ఈ అక్షర నివాళి )

2 కామెంట్‌లు:

Radha చెప్పారు...

శహబాష్.
శ్రీ పింగళి వారి వారసులేమోననిపించారు.
చాలా ఆలస్యంగా చదివినా అమృతమేననిపించాయి మీ పద్యాలు కవితలు.

sudharani65 చెప్పారు...

శశిధర్ గారూ,
మీరు ఎక్కడో ఎన్టీరామారావు, వాణిశ్రీ నటించిన వరూధినీ ప్రవరాఖ్య అంతర్నాటకం ఏ చిత్రంలో తెలపమని అడిగారు కదా.
మనుషుల్లో దేవుడు అనే సినిమాలో సినారె గారు రచించిన వరూధినీ ప్రవరాఖ్య అంతర్నాటకంగా చిత్రించబడింది. మీకు ఆ పాట వినాలనుకుంటే నాకు చెప్పండి.