స్వాగతం

కం|| అందమ్ముగ తెలుగు కవిత | లందింతుము, చదివిమీరు స్వారస్యముతో | స్పందనలందించుటకై | చందన తాంబూల విధుల స్వాగతమిదియే!

==========================================================================================================

25, డిసెంబర్ 2008, గురువారం

దూరం

[పింగళి శశిధర్]

ఆలోచనా తరంగిణి కా
ఒడ్డులో నీవు – ఈ
ఒడ్డులో నేను -
అలల అలజడిలో
వెనుకడుగే ఇద్దరిదీ !
కానీ -
కాళ్ళ క్రింది ఇసుకొకటే
కాలంలా కరిగిపోతూ
కలిపే ప్రయత్నం చేస్తోంది
ఇద్దర్నీ !?

నవంబరు నెల పొద్దు లో పొద్దు పొడిచిన ఈ కవితను ఈ క్రింది లింకు ద్వారా కూడా చేరుకొవచ్చు.పొద్దు పెద్దలకు ధన్యవాదములతో..
http://poddu.net/?q=user/39

7, నవంబర్ 2008, శుక్రవారం

శాక్య కంఠీరవా !

[పింగళి వేంకట శ్రీనివాసరావు (శ్రీకాశ్యప)]

తే.గీ:   అది దయార్ణవ స్థగిత సింహాసనమ్ము
         అందు కొలువుండె కరుణార్ద్ర మందహాస
        చిన్మయాంచిత ముద్రికా శ్రీవతంసు
        డార్తి నెడబాపు శుధ్ధోదనాత్మజుండు.

తె.గీ: చెంతనే నాక వనసీమ సిరివెలార్చి
        నవ నవోన్మేషచంద్రికా యవనికలను
        పరచుకొన్న లుంబినీ వనమునందు
       విహరణార్ధము చనుదెంచె, మహిజనమ్ము.

సీ:    ముక్కుపచ్చారని మురిపెంపు నడలతో చిరునవ్వు లొలికించు చిన్నివారు
       ఆగామి జీవిత రాగోజ్వలత గోరి విద్యలార్జించెడి విమల మతులు
       ఎదపైన భవితను పదిలమ్ముగావించి సిరిమువ్వలై మ్రోయు తరుణితతులు
      మరుతరమ్ముల వారి కిరవైన మార్గముల్ సరిచేసి యాత్మలో మురియు వారు

2, అక్టోబర్ 2008, గురువారం

విశాల హృదయాలు

[పింగళి శశిధర్]

ప్రపంచం చిన్నదై పోయింది
అయితే నేం
మా హృదయాలు మాత్రం విశాలం - ఎంతంటే
స్వధర్మాన్నే కాదని - పర ధర్మాని కి
పట్టం కట్టే టంత !
ప్రపంచీకరణ నేపధ్యం లో
దేశానికీ దేశానికీ మధ్య - అడ్డు
గోడలు కూలిపోయాయట
ఔను - నిజం !
ఆ ఇటుకల తోనేగా మాకూ మాకూ మధ్య
కొత్త గోడలు కట్టు కున్నాం
ఐతే నేం ?
మా హృదయాలు మాత్రం విశాలం !
దేశీయత మా స్వంతం - విదేశీయత మా పంతం
ఎంతంటే !
మా చదువుల్లో మాతృ భాష లేదు
మా హృదయాలకి మాతృ ఘోష తెలీదు
సంస్కృతీ కే సంస్కరణ లు - చేసే
సంస్కారం - మాది !
ప్రపంచం చిన్నదై పోయింది
అయితే నేం ?
మా హృదయాలు మాత్రం విశాలం !?

30, సెప్టెంబర్ 2008, మంగళవారం

ఖుషీ

[పింగళి శశిధర్]

హుషారోయి - హుషారోయి
వసంత కాల ఉష !
ఖుషీ చేయి - ఖుషీ చేయి
తుషారాల నిషా !!

25, సెప్టెంబర్ 2008, గురువారం

దాశరధి

(పింగళి శశిధర్)

కోటి రతనాల వీణ - తన
తెలంగాణ లో
మారు మ్రోగిన కంఠంబు
మూగ వోయె -
బూజు పట్టిన భావాల - రాజు
నైజాము పై
పదను పాళీల కలము తో
కదము నడపి -
తిమిర రక్కసి - కోరలు
పెఱికి వేయ - ఘోర
సమరము సేసిన సాహసీడు -
కుపిత మనస్కుల చూచి - క్రుధ్ధుడై -
తన రుద్ర వీణ పై
ఢమ ఢమ రున్నినాదాలు
చేసి - చేసి
అలసిపోయిన - ఆ
కవి చంద్రుడడుగొ
అరుగు చున్నాడు
ఆకసము పైకి -
వెలుగు నక్కడ -
వేరొక్క చుక్క వోలె!

(మహాకవి దాశరధి అస్తమించినప్పుడు అశ్రుపూరిత నయనాలతో నే వ్రాసుకొన్న ది)