ఆదివారం 11 మార్చి 2012

చూడాలని వుంది

            [  శశిధర్ పింగళి ]


    నేజూచిన కన్నులు నాలో -
    కలిగించెను కమ్మని భావనలేవో
    అనిపించెను నాలో నాకే -
    అవి కన్నులు కావేమో?
    వికసించిన ..
    నల్లని కలువల జంటేమో! నని
    ఆ..... నల్లని కాటుక కన్నులలో
    యే మత్తుందోగానీ - మరి
    అరె !

గురువారం 12 జనవరి 2012

సంక్రాంతి శుభోదయమ్ము మనగా వలె జాతికి భవ్య క్రాంతియై

            [ పింగళి మోహిని ]

1. బంతులు బంతులై కనుల పండువు చేయగ గోమయంబుచే
    కాంతలు గొబ్బిళుల్ మిగుల కౌతుకమొప్పగ తీర్పరింపగా
    వింతగు బొమ్మలన్ కొలువు వేడుక మీరగ తీర్చిదిద్దు; సం
     క్రాంతి శుభోదయమ్ము మనగా వలె జాతికి భవ్య క్రాంతియై !

2.  ఇంతలు యింతలై పుడమి యీవలె సస్యము మానవాళికిన్
     చింతరవంతలేని సుఖ జీవన భాగ్యము కల్గజేయగా
     శాంతి సమానతా సుగుణ సంపద తుష్టిని పుష్టినిచ్చు; సం
      క్రాంతి శుభోదయమ్ము మనగా వలె జాతికి భవ్యక్రాంతియై !!


3.  లే తలిరాకు జొంపముల లీలగ తోచుచు పూచినట్టివౌ
    పూతలు పిందెలై పెరిగి వేల ఫలంబులొసంగు నట్లు గా
     జాతి హృదంతరాశలను శాశ్వత రీతి ఫలింప చేయ; నీ
      నూతన వత్సరమ్మున కనూన ముదావహ స్వాగతమ్మిదే !!!
                      అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

శనివారం 31 డిసెంబర్ 2011

అందుకొనుమోయి - మిత్రమా

              [పింగళి శశిధర్]      

     అదిగొ చూడు
     మినుకిరణముద్భవించె!
     చీకటి ప్రాకారముల్ ఛేదించుకొని వచ్చు
     ఉషస్సుందరి సుందర
     నేత్రద్వయాన - వెలుగు
     వెచ్చని అరుణ కిరణమ్ము భంగి
     భవత్ సౌశీల్య సౌహార్ద్ర
నూతన సంవత్సర శుభాకాంక్షలు
     సంపదలు మెచ్చి - వచ్చిన
     సంక్రాంతలక్ష్మి - మోము
     విరిసిన - మధుర
     దరస్మిత స్పురిత వైభవము మాడ్కి -
     శీఘ్ర చైతన్య రీతుల
     వచ్చు చున్నది -
     క్రొంగొత్త వత్సరమ్ము
     తెరచి - తలుపులు
     పలుకుమా "స్వాగతమ్ము"
     అందుకొనుమోయి - మిత్రమా! - నా
     శుభాకాంక్షలిపుడె.



సోమవారం 26 డిసెంబర్ 2011

డైరీ

[పింగళి శశిధర్]

గతమంతా - ఓడైరీ
అయితే -
గమ్య మెరుగని పయనం లో
గతించిన కాలమంతా
వ్రాసేసిన పేజీలు -
ఎక్కడో - ఎప్పుడో
జరిగిన కొన్ని
"తీపి జ్ఞాపకాలు" మాత్రం
మక్కువ తో - మడచి
పెట్టుకొన్న
"తెల్ల కాగితాలు".

మంగళవారం 29 నవంబర్ 2011

అన్వేషణ

     [పింగళి శశిధర్]

     చీకటి  -
     నా అన్వేషణకి అంతరాయం కలిగిస్తూ
     అవనిపై ఆక్రమించుకుంటోంది
     నిన్నటిదాక నేస్తాలై
     నా చుట్టూ వున్న చెట్టూ చేమలన్నీ
     వికృతరూపాలై వికటాట్టహాసం చేస్తున్నాయి
     చర్మ చక్షువులు నిశ్చేష్టలై
     నీరసించి నిద్రలోకి జారుకుంటున్నాయి
     బాహ్యేంద్రియాలు సైతం చేష్టలుడిగి
     అచేతనంగా పడివున్నాయి
     మూసిన కనురెప్పల క్రింద
     మూతపడని ఆలోచనా లోచనాలు మాత్రం
     అన్వేషణ సాగిస్తూనే వున్నాయి
     అయితే
     చీకటి నిండిన బాహ్యంలో కాదు
     అంతరంలో
     అంతరమంతా శూన్యం -
     శూన్యంలోనే తరంగదైర్ఘ్యాలు పుడుతూవుంటై - పోతూవుంటై
     దాటి సాగితే - దూరంగా...
     వెలుగులు చిమ్ముతూ ఓ కాంతిరేఖ
     చీకటిని చీల్చుకుంటూ...
     చూచిన కన్నులు చలమలైపోతున్నాయి
     ఆనందసాగరానికి ఏతమెత్తినట్లు
     అశ్రుధారలు ప్రవాహమై పారుతున్నాయి
     అటువైపే నా పయనం
     ఆగని నా ప్రయాణం
     క్షణకాలం మెరిసిన మెరుపు వెలుగు లో
     చూస్తే, నే దాటొచ్చిన దూరం యాభై మైళ్ళు
     గమ్యం నిర్ధారితమైంది - చేరుకోవాలనే
     లక్ష్యం నిర్దేశితమైంది
     ప్రయాణం సాగుతూనే వుంది
     వెచ్చని వూపిరులేవో ఒడలెల్లా తాకుతూవుంటే
     ఒడలిన కంటి కుసుమాలు కొత్త జీవంతో విచ్చుకుంటున్నాయి
     బడలిక తీరిన బాహ్యేంద్రియాలు చేతనత్వాన్ని నింపుకుంటున్నాయి
     చీకటిని జయించిన వేకువ
     వెల్లువలా విరుచుకు పడుతోంది
     మళ్ళీ మొదలైంది అన్వేషణ
     అయితే ఈసారి బాహ్యంలో కాదు
     అంతరంలో.....

శనివారం 12 నవంబర్ 2011

మనోహరి !

    [ శశిధర్ ఫింగళి ]

నాశాంత తనుకాంతి ఆశాంతమై తోచు
      నా కాంత కను కాంతి చంద్రకాంతిని త్రోచు
నా రాణి పాదాల పారాణి వెలుగులే
      ప్రాగ్భాగమరుణిమై ప్రభలు చిందు
నా బాల ఫాల మర్ధచంద్రుని బోలు
      ఆ నీలి కురులలో నెరితుమ్మెదలు వ్రాలు
నా కలికి గొంతులో కులుకు కోయిల కూన
      ఆ కులుకు పలుకులో కురియు తేనెలవాన
నా రాగ సుందరీ నాట్యమాడెడివేళ
      అచ్చంపు రాయంచలడుగులొత్తు
నా వాణి వేణిలో విరియు మల్లెల సౌరు
      సొక్కి విహరించు నా యెడద యెక్కి వెన్నెల తేరు
నా లేమ వనసీమ నడయాడు సమయాన
      పసిడి పచ్చని చేలు పాటపాడు
నా చాన చనువార చెయిసాచి పిలువంగ
      సింహ, శార్దూలముల్ చెలిమి చేయు
నా సఖియ వెలయించు సౌహార్ద్రతను చూచి
      సూర్యుడంతటి వాడు సుధలు కురియు
నా తరుణి గుణగణాల్ నా తరమె వర్ణింప
      దాన సరితూగు చానలీ లోకాన లేరన్న
అతిశయోక్తులు కావులే అతివలార -
ఏ పూర్వ పుణ్యమో -  ఏ పుణ్యఫలితమో
అతివ రూపాన నాకొరకె అవతరించి
వలపునిండిన గుండెతో నను వరించె.


బుధవారం 26 అక్టోబర్ 2011

దీపావళి

     [ మోహిని ]

     పూజిత సర్వ లోకుడల భూరిపరాక్రమ కృష్ణస్వామికిన్
     ఆ(జి సహాయసంపదలనందగజేసి కృతార్థయైన, సా
     త్రాజితి, యుక్తి సాహస పరాక్రమ శాలిని, సత్యభామినీ
     తేజము నిండగావలయు స్త్రీల మనమ్ముల దీప్తివంతమై !

     కలకల లాడు ముంగిళుల కాంతులు చిమ్మెడి దీపశ్రేణిలో
     తొలగెను చిమ్మచీకటి, విధూదయ బ్రాంతినిపెంచునట్టివౌ
     వెలదుల నవ్వులో గలసి వెవ్వెలబోయెను తారకామణుల్
     నిలచును గాక ఈ వెలుగు 'స్నేహ' యుతమ్ముగ నిత్యనూత్నమై !!

     వెన్నెలబోలు నవ్వులను పెద్దల మోమున కానలేమితో
     వన్నెల చిన్నెలన్ వెలుగు బాలల ప్రాభవ భవ్యలోక పుం
     గన్నుల తళ్కుతళ్కుమను కాంతికి చుక్కలు పోలగా, మరో
     మిన్నుగ కానవచ్చెగద మేదిని, దీపపు పర్వవేళలన్ !!!

     దీపావళి శుభాకాంక్షలతో.....